Telangana: కేటీఆర్ సేవలో ఇంటర్ బోర్డు: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • ఇంతటి దారుణమైన విద్యావ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు
  • గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోరే?
  • ఇంటర్ బోర్డు కాదు, కేసీఆర్ పరిపాలన ఎత్తిపోవాలి

విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంతటి దారుణమైన విద్యావ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు. కేటీఆర్ సేవలో ఇంటర్ బోర్డు తరిస్తోందని, ‘ఇంటర్ బోర్డు కాదు, కేసీఆర్ పరిపాలన ఎత్తిపోవాలి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అకృత్యాలను ఖండిస్తున్నాం: మల్లు

తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల గురించి ఆలోచించకుండా గ్లోబరినా సంస్థకు, కార్పొరేట్ కళాశాలలకు మేలు చేయడం కోసమే ఆలోచించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అకృత్యాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.

ప్రభుత్వంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి: పొన్నం

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని  విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.

More Telugu News