China: పన్ను కట్టమంటే పత్తా లేకుండా పోయిన చైనా టాప్ హీరోయిన్.. ఏడాది తర్వాత ప్రత్యక్షం

  • గత ఏడాది జులై నుంచి అజ్ఞాతంలో ఉన్న ఫాన్ బింగ్ బింగ్
  • లేటెస్ట్ గా ఓ ప్రయివేటు కార్యక్రమంలో దర్శనమిచ్చిన వైనం
  • నటిపై భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు

చైనా యువతకు ఫాన్ బింగ్ బింగ్ ఓ ఆరాధ్యదేవత. చైనా ఫేస్ బుక్ గా పేరుగాంచిన సీనా వీబోలో అమెకు ఏకంగా 6.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.  ఇరవై ఏళ్లుగా చైనా చిత్రసీమను తన అందచందాలు, నటనతో ఏలిన 37 ఏళ్ల ఫాన్ గతేడాది జులైలో ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. ఆమె ఏమైందో, ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. కనిపించకుండా పోవడానికి ముందు ఆమెపై భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి.

పన్ను ఎగవేతకు చైనాలో కఠిన శిక్షలు విధిస్తారన్న నేపథ్యంలో ఫాన్ బింగ్ బింగ్ విదేశాలకు పారిపోయి ఉండొచ్చని అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఫాన్ ఇటీవల ఓ ప్రయివేటు కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. రెడ్ కార్పెట్ పై వయ్యారంగా పోజులిచ్చిన నటీమణిని చూసి అందరూ విస్మయానికి గురయ్యారు.

తన పునరాగమనాన్ని పురస్కరించుకుని అమ్మడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. కాగా, చైనా ఆదాయ పన్ను శాఖతో ఫాన్ రాజీపడినట్టు, పన్ను చెల్లింపుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News