: ఇక గరిటె తిప్పనున్న సంజయ్ దత్!
ముంబయి పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలుశిక్షకు గురైన బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ తన శిక్షా కాలాన్ని పుణేలోని యెరవాడ జైలులో గడపనున్నాడు. గతంలో కూడా ఈ కేసులో ఇదే జైల్లో కొంతకాలం గడిపిన సంజయ్ దత్ మళ్ళీ అక్కడికే చేరుకోనున్నాడు. అయితే, జైలు ఖైదీల విధుల్లో భాగంగా ఈసారి సంజయ్ దత్ వంటగదిలో గరిటె తిప్పుతాడట. ఇంతకుముందు ఇక్కడ వడ్రంగం పని నేర్చుకుని వెదురుతో ఓ కుర్చీ కూడా తయారు చేశాడీ బాలీవుడ్ పొడగరి. ఈసారి మాత్రం వంటగదికే పరిమితమవుతానంటున్నాడు.
ఆరుబయట చేయాల్సిన పనులైతే కాస్త శ్రమతో కూడుకున్నవి అయివుంటాయని, అదే వంటపని అయితే, ఓ గదికే పరిమితం అవుతుందని, తద్వారా భద్రత కూడా లభిస్తుందన్నది సంజయ్ ఉద్ధేశం. ఇక, జైల్లో ఖైదీలు చేసే పనులకు దినసరి వేతనం ఉంటుందని తెలుసుకదూ. సంజూకి అసిస్టెంట్ కుక్ గా రోజుకు రూ. 25 గిట్టుబాటు అవుతాయట. అదే కుక్ గా పదోన్నతి పొందితే రోజుకు రూ. 50 కళ్ళజూడొచ్చండోయ్!