Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది: వైసీపీ నేత ఆనం
- 9 నెలల్లో తీసుకోవాల్సిన అప్పులు ఒక నెలలోనే
- ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్ కింద నిధులను తీసుకుంది
- రాష్ట్రం పతనం కావడానికి బాబు విధానాలే కారణం
చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన అప్పులను ఒక నెలలోనే తీసుకున్నారని వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్ కింద నిధులను ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. గత రెండు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, చేసిన అప్పులతో తమకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోందని ఆరోపించారు. ఆర్థికంగా రాష్ట్రం పతనం కావడానికి బాబు విధానాలే కారణమని, ప్రభుత్వం ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించడం దారుణమని, సీఎఫ్ఎంఎస్ ను ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ కృష్ణదేవరాయలు చేతిలో పెట్టారని ఆరోపించారు. ఆర్థిక శాఖలో అవకతవకలను ప్రశ్నించిన సీఎస్ ను విమర్శించడం సరికాదని విమర్శించారు. ఆర్థిక శాఖలో అవకతవకలను చూసిన ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్లిపోతున్నారని అన్నారు. ఆర్థిక శాఖ తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆనం రామనారాయణరెడ్డి డిమాండ్ చేశారు.