Jagan: కుటుంబంతో కలసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళుతున్న జగన్!
- ఆల్ప్స్ పర్వతాల్లో విహారం
- తిరిగి ఈనెల 27న హైదరాబాద్ రాక
- గతేడాది న్యూజిలాండ్ వెళ్లిన జగన్
వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత పెద్ద రాజకీయనాయకుడు అయినా కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయిస్తుంటారు. ముఖ్యంగా తన కుమార్తెల కోసం ఎంత బిజీ షెడ్యూల్ లో అయినా తీరిక చేసుకుంటారు. ఈ క్రమంలో, పోలింగ్ ముగిసిన దరిమిలా కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఆయన స్విట్జర్లాండ్ వెళుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వేసవితాపం తీవ్రరూపు దాల్చడంతో ఆయన స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో సేదదీరాలని నిర్ణయించుకున్నారు. అత్యంత ఆహ్లాదకరమైన, శీతల దేశంగా పేరుగాంచిన ఈ యూరప్ దేశంలో జగన్ తన కుటుంబంతో కలిసి విహరించనున్నారు. ఆపై ఈ నెల 27న హైదరాబాద్ తిరిగి వస్తారు. గతేడాది కూడా జగన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం, అక్కడ సాహసోపేతమైన రీతిలో బంగీజంప్ చేయడం అభిమానులను, పార్టీ కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.