Chandrababu: కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు క్లాస్
- ఇవాళ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
- అభ్యర్థులకు దిశానిర్దేశం
- అందరూ హాజరవ్వాలంటూ ఆదేశాలు
మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా, ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చే 17-సి ఫారాలు, ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు, మొత్తం ఓట్ల వివరాలు తెలియజేసే ఇ-ఫారాలపై అభ్యర్థులకు ముందుగానే అవగాహన కలిగించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో తమ పాత్ర ఎలా ఉండాలన్న దానిపైనా చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. ఈ కీలక సమావేశానికి టీడీపీ అగ్రనేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ హాజరవ్వాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.