Telangana: ఇంటర్ ఫలితాల్లో మార్కులే కాదు, ఏకంగా గ్రూపే తారుమారు చేశారు!
- ఎంఈసీకి బదులు సీఈసీగా పేర్కొన్న వైనం
- మెమోలో ఫస్టియర్ సబ్జక్టులు గల్లంతు
- ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు
ఇంటర్ ఫలితాలపై ఎలాంటి అపోహలు అవసరంలేదని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్లకు ఫెయిల్ మార్కులు వేయడమే కాదు, ఏకంగా గ్రూప్ నే తారుమారు చేసిన ఘటన వెల్లడైంది.
ఖమ్మం పట్టణానికి చెందిన పోట్లపల్లి సాహితి ఇంటర్ లో ఎంఈసీ గ్రూప్ తీసుకుంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మోడల్ జూనియర్ కాలేజిలో చదివి పరీక్షలు రాసింది. సాహితి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ లో పాసైంది. తాజాగా సెకండియర్ పరీక్షలు రాసింది.
అయితే, ఫలితాలు చూసుకున్న ఆమెకు దిగ్భ్రాంతి కలిగింది. మార్కుల మెమోలో ఫస్టియర్ సబ్జెక్టులు గల్లంతయ్యాయి. దానికితోడు గ్రూప్ కూడా మారిపోయింది. సాహితి చదివింది ఎంఈసీ అయితే మెమోలో సీఈసీ అని పేర్కొన్నారు. దీనిపై ఆందోళన చెందిన ఆ విద్యార్థిని ఇంటర్మీయడిట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.