Andhra Pradesh: మే 23న చంద్రబాబును ఏపీ ప్రజలు మెడపట్టి బయటకు గెంటబోతున్నారు!: అంబటి రాంబాబు
- బాబు విచిత్రమైన రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు
- ఆయన్ను ఎల్లో మీడియా పోరాటయోధుడిగా చూపిస్తోంది
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రవిచిత్రమైన రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన్ను ఎల్లో మీడియా పోరాటయోధుడిగా చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు కనిపించని ప్రజాస్వామ్యం బాబుకు ఇప్పుడే కనిపిస్తుందా? అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.
వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో పాటు వారిలో నలుగురిని మంత్రులుగా చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమయిపోయిందని చంద్రబాబును అంబటి ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కొంటున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా? అని అడిగారు. ‘ప్రజాస్యామ్యానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ఎన్నికల వ్యవస్థపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దోషం వ్యవస్థలో లేదు చంద్రబాబు.. ఆ తప్పంతా మీలో, మీ పాలనలోనే ఉంది. చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారు’ అని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారులకు పచ్చదుస్తులు వేయించి పనిచేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేలా ప్రజాతీర్పు ఉండబోతోందని జోస్యం చెప్పారు. మే 23న చంద్రబాబును ఏపీ ప్రజలు మెడపట్టి బయటకు గెంటబోతున్నారని వ్యాఖ్యానించారు.