Andhra Pradesh: ఫోన్లో పరిచయం అయ్యాడని ప్రేమిస్తే, రూ.70 లక్షలు ఖర్చు పెట్టించాడట.. యువతి మౌనపోరాటం!
- నాలుగేళ్లుగా ప్రేమ
- ప్రియుడు మొహం చాటేశాడంటూ ఆవేదన!
- టంగుటూరు చేరుకున్న ప్రియురాలు
ప్రియుడు మోసం చేశాడంటూ ఓ యువతి ప్రకాశం జిల్లా టంగుటూరు వచ్చి మౌనపోరాటానికి దిగింది. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతానికి చెందిన సహస్ర, టంగుటూరుకు చెందిన పూనాటి అరవింద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఇద్దరికీ ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఏడాది క్రితం తండ్రి చనిపోయాడంటూ అరవింద్ టంగుటూరు వచ్చేశాడు.
ఆ తర్వాత సహస్ర ఎన్నిసార్లు అతడితో మాట్లాడాలని ప్రయత్నించినా వీలు కాలేదు. ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని సహస్ర గ్రహించింది. చివరి ప్రయత్నంగా నేరుగా టంగుటూరు చేరుకుని అరవింద్ ఇంటికి వెళ్లగా అక్కడా నిరాశే ఎదురైంది. ఇంటికి తాళం వేసి కనిపించింది. దాంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది. తనతో పరిచయం అయ్యాక రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టించాడని, తాను టంగుటూరు వస్తున్న విషయం తెలుసుకుని ఇంటికి తాళం వేసి పారిపోయాడని ఆరోపించింది.
అంతేగాకుండా, అరవింద్ ను మర్చిపోవాలంటూ బెదిరింపులు వస్తున్నాయని, అందుకే తనకు రక్షణ కల్పించడంతోపాటు అతడితో పెళ్లి కూడా జరిపించాలని సహస్ర వేడుకుంటోంది. కాగా, టంగుటూరులో పోలీసులను ఆశ్రయించిన సమయంలో హైదరాబాద్ లో ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు సలహా ఇచ్చినట్టు అర్థమవుతోంది. దాంతో సహస్ర టంగుటూరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఓ వీడియోలో దర్శనమిచ్చింది.