BJP: సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కు ఎన్నికల అధికారి నోటీసులు

  • కర్కరేపై వ్యాఖ్యల ఫలితం
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపణలు
  • వివరణ కోరిన జిల్లా ఎన్నికల అధికారి

బీజేపీలో సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఓ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. ఆమె మాటతీరు ఎంతో కఠినంగా ఉంటుందని, కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుందని అనేక సంఘటనలు వెల్లడించాయి. తాజాగా, 26/11 ఉగ్రదాడిలో జాతీయ హీరోగా పేరు తెచ్చుకున్న దివంగత పోలీసు అధికారి హేమంత్ కర్కరేపై ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల ఆగ్రహానికి గురయ్యాయి.

తనను విచారణ సందర్భంగా తీవ్రంగా కొట్టడంతో, కర్కరేకు శాపం పెట్టానని, అందుకే చనిపోయాడంటూ ప్రజ్ఞా వ్యాఖ్యానించడాన్ని రాజకీయ ప్రముఖులు సైతం తప్పుబట్టారు. దాంతో ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి, కర్కరే అమరవీరుడేనంటూ కీర్తించారు.

అయితే, ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. కర్కరేపై వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై బదులు ఇవ్వాలంటూ జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ మేరకు సాధ్వీ సింగ్ కు నోటీసులు పంపారు. ప్రజ్ఞా లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని భోపాల్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

BJP
  • Loading...

More Telugu News