Chandrababu: కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యేవరకు ఈ ప్రభుత్వ పాలన కొనసాగి తీరుతుంది: కనకమేడల స్పష్టీకరణ
- సమీక్షలు జరపడం ప్రభుత్వ బాధ్యత
- ఈసీ పరిధి పోలింగ్ తోనే ముగిసింది
- పాలనలో ఈసీ జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది
రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఎన్నడూ ఆదేశించరని టీడీపీ నేత, పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ విధులు నిర్వర్తించే క్రమంలో ఎవరి పనులు వాళ్లు చేసుకుంటే సమీక్షలు జరపాల్సిన అవసరం లేదని అన్నారు. విధి నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు, విధి నిర్వహణ నత్తనడకన సాగుతున్నప్పుడు పాలకులు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.
అధికారులను ప్రభుత్వం నడిపించడం అనేది కోడ్ కు విరుద్ధం కాదని, మళ్లీ కొత్తగా ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు ఈ ప్రభుత్వ పాలన కొనసాగి తీరుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 'ఆ విషయాన్ని చట్టం చెబుతోంది, రాజ్యాంగం కూడా చెబుతోంది' అని కనకమేడల ఉద్ఘాటించారు.
"దీనికి ఎవరు ఎన్ని వక్రభాష్యాలు చెప్పినా, నిజానికి ఎన్నికల కమిషన్ పరిధి చాలా పరిమితమైనది. ఆ పరిధి మొన్నటి పోలింగ్ తో ముగిసింది. ప్రస్తుతం ఉన్న పరిధి సాంకేతికపరమైనదే తప్ప వాస్తవికమైనది కాదు. ఫలితాల వరకే ఉండే ఆ పరిధి కూడా ఆంక్షలు విధించడానికి కాదు. ఎవరి పరిమితులు వాళ్లు గుర్తెరిగి నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు, విపక్షాలు ఆరోపణలు చేశాయని భయపడాల్సిన పనీ ఉండదు. మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చేవరకు ఇప్పుడున్న ప్రభత్వమే పాలన చేయాలి కాబట్టి, ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తున్నాం.
ఎన్నికల సంఘం గురించి ఎందుకు చెబుతున్నామంటే, ఎన్నికల సంఘంపై ఇటీవల చాలా ఆరోపణలు వచ్చాయి. ఆచరణలో పక్షపాత ధోరణి చూపిస్తోందంటూ కొన్ని సంఘటనలు చూసి ఉన్నాం. అందుకే ఎన్నికల సంఘానికి కూడా సూచనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పాలనా వ్యవహారాల్లో ఈసీ జోక్యం చేసుకోవడం భావ్యం కాదని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం" అంటూ కనకమేడల తన ప్రెస్ మీట్ ముగించారు.