Mahesh Babu: మహేశ్ మూవీ కోసం విజయశాంతిని ఒప్పించిన అనిల్ రావిపూడి?
- కొంతకాలంగా సినిమాలకి దూరంగా విజయశాంతి
- రీ ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నంలో దర్శక నిర్మాతలు
- రానా సినిమాలో చేయడానికి తిరస్కరించారని టాక్
నిన్నటి తరం కథానాయికలుగా తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగినవారిని ముఖ్యమైన పాత్రల కోసం రంగంలోకి దింపడమనేది టాలీవుడ్లో ఇప్పుడు కొత్తదనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే నదియా .. ఖుష్బూ .. టబు .. భూమిక .. తెరపైకి వచ్చేశారు. ఇక రాజకీయాల్లో బిజీగా వున్న విజయశాంతిని కూడా రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రానా .. సాయిపల్లవి కాంబినేషన్లో దర్శకుడు వేణు ఊడుగుల ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించారట. ఇక మహేశ్ బాబుతో తాను చేయనున్న సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని అనిల్ రావిపూడి సంప్రదించినట్టుగా తెలుస్తోంది. పాత్ర ప్రాధాన్యత .. కాంబినేషన్ సీన్స్ గురించి వివరించడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా వున్న ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరించారనడంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.