Chandrababu: ఇటు చంద్రబాబు దంపతులు, అటు నరసింహన్ దంపతులు.. ఒంటిమిట్టలో కల్యాణ వైభోగం
- ఘనంగా సీతారామ కల్యాణం
- వేలమంది భక్తుల రాక
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
శ్రీరామనవమి అనంతరం ఏపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో రాములవారి కల్యాణం నిర్వహించారు. సీతమ్మ తల్లితో రామయ్య వివాహం చూడ్డానికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారి కల్యాణానికి అవసరమైన లాంఛనాలను అందించారు. పట్టువస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలను స్వయంగా మోసుకువచ్చి పురోహితులకు అప్పగించారు.
సీతారామ వివాహ మహోత్సవానికి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. టీడీపీ నేత సీఎం రమేశ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ సాగిన ఈ వివాహాన్ని తిలకించిన భక్తులు తరించిపోయారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ లు కాస్త తగ్గుస్వరంతో అనేక పర్యాయాలు సీరియస్ గా మాట్లాడుకోవడం కనిపించింది.