Chandrababu: చంద్రబాబు తీరు నిబంధనలకు పూర్తి వ్యతిరేకం అంటూ ద్వివేదీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
- చంద్రబాబు కోడ్ ఉల్లంఘిస్తున్నారు
- సీఎం హోదాలో సమీక్షలు నిర్వహించరాదు
- చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి
వైసీపీ ముఖ్యనేతలు ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మరోసారి కలిశారు. చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించరాదని, కానీ చంద్రబాబు ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.
అధికారిక భవనాల్లో సమావేశాలు పెట్టకూడదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కోడ్ చెబుతోందని, కానీ చంద్రబాబు అన్నింటికీ తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ద్వివేదీకి వివరించారు. తన చర్యల ద్వారా అధికారులను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
అమరావతిలోని ప్రజావేదికలో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించడం కూడా నిబంధనలకు వ్యతిరేకం అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. తమ ఫిర్యాదును పరిశీలించి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వారు సీఈవోను కోరారు.