West Bengal: సీపీఎం ఎంపీ మొహమ్మద్ సలీంపై హత్యాయత్నం.. కత్తులు, కర్రలతో 500 మంది దాడి!

  • పశ్చిమబెంగాల్ లోని ఇస్లామ్ పూర్ లో ఘటన
  • వేగంగా కారును పోనిచ్చి కాపాడిన డ్రైవర్
  • తృణమూల్ గూండాలే దాడిచేశారన్న సీపీఎం నేతలు

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్ లో హింస చెలరేగింది. డార్జిలింగ్ లోని ఓ పోలింగ్ కేంద్రంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడిచేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. మరోవైపు సీపీఎం నేత, రాయ్ గంజ్ లోక్ సభ సభ్యుడు మొహమ్మద్ సలీంపై దాడి జరిగింది. సలీం కాన్వాయ్ లక్ష్యంగా ఇస్లామ్ పూర్ లో దాదాపు 500 మంది దాడికి తెగబడ్డారు.

పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన సలీమ్ కాన్వాయ్ పై ఇస్లామ్ పూర్ లో కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, కొందరు అనుచరులకు గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సలీం డ్రైవర్ కారును వేగంగా అక్కడి నుంచి ముందుకు పోనిచ్చాడు.

దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, తమపై దాడి జరుగుతుంటే పోలీసులు తమాషా చూస్తున్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు. ఆందోళనకారులను కనీసం అడ్డుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలే దాడిచేశారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.

More Telugu News