YSRCP: జగన్ గెలిచినా చంద్రబాబు అంగీకరించరు, తానే సీఎం అంటూ మరో చోట ప్రమాణస్వీకారం చేస్తారు!: దాడి వీరభద్రరావు సెటైర్
- చంద్రబాబు తన ఓటమిని ఎవరిపై నెట్టాలా అని చూస్తున్నారు
- చంద్రబాబు కొడుకును నియంత్రించుకోలేని స్థితిలో ఉన్నారు
- 2014లో ఇవే ఈవీఎంలతో గెలవలేదా?
వైసీపీ నేత దాడి వీరభద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలియడంతో ఆ నెపాన్ని ఎవరిపై నెట్టాలా? అని చంద్రబాబు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ గెలిచినా, ఆ విషయాన్ని చంద్రబాబు అంగీకరించరని, తానే సీఎం అంటూ మరోచోట ప్రమాణస్వీకారం చేస్తారని వ్యంగ్యం ప్రదర్శించారు.
చంద్రబాబు పదేపదే ఈవీఎంలు, ఈసీపై విమర్శలు చేయడం ద్వారా విలువలకు పాతరేసి కొత్త రాజకీయాలకు తెరలేపారని దాడి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలను విమర్శించడం ద్వారా చంద్రబాబుకు కలిగే లాభం ఏమీలేదని అన్నారు.
2014లో ఈవీఎంలతోనే గెలిచిన చంద్రబాబు, ఇప్పుడవే ఈవీఎంలపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్-టీడీపీ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన దాడి, ఐటీ మంత్రిగా లోకేశ్ డేటా చోరీకి పాల్పడ్డారంటూ ఆరోపించారు. చంద్రబాబు కొడుకును నియంత్రించుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.