Chandrababu: ఒక వీడియో సరిగా రాకపోతే మరో వీడియో రిలీజ్ చేశాను, అది చూసి జనాలు పోటెత్తారు: చంద్రబాబు
- మధ్యాహ్నానికి ప్లాన్ మార్చేశాం
- ప్రతి 15 నిమిషాలకు అందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నాను
- వెంకటేశ్వరస్వామి కోసం రెండుమూడు రోజులు క్యూల్లో ఉండడం లేదా? అన్నారు
పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈసీ పనితీరును వీలైనన్ని మార్గాల్లో ఎండగడుతూనే ఉన్నారు. ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఆయన జాతీయస్థాయి నేతల దృష్టిని తన వాదనపై పడేలా చేయడంలో సఫలీకృతుడయ్యారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో ఏకంగా 23 పార్టీల మద్దతు పలకడం చంద్రబాబు కృషికి నిదర్శనం అని చెప్పాలి. తాజాగా, అమరావతిలో మరోసారి ఇదే అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘం వైఫల్యం చెందిందంటూ నిప్పులు చెరిగారు.
శాంతిభద్రతల పరంగా భరోసా ఇవ్వడంలో ఈసీ పనితీరు శూన్యమని అభిప్రాయపడ్డారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రౌడీలు పేట్రేగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట ఈవీఎంల పనితీరు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తే, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు బెంబేలెత్తించాయని తెలిపారు. దాంతో తాము మధ్యాహ్నం నుంచి వ్యూహం మార్చుకోవాల్సి వచ్చిందని, ప్రజలను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ప్రతి 15 నిమిషాలకు ఓసారి పార్టీ శ్రేణులతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నామని చంద్రబాబు వెల్లడించారు.
"ఆ సమయంలో కమ్యూనికేషన్ ఒక్కటే ఆధారం. మీడియా లేకపోతే మాకు ఆ మాత్రం కమ్యూనికేషన్ కూడా వీలయ్యేది కాదు. ఆ రోజు సాయంత్రం నేను రెండు వీడియోలు రిలీజ్ చేశాను. మొదట ఓ వీడియో సరిగా లేకపోతే రెండోది విడుదల చేశాను. ఆ వీడియో చూసిన ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు విపరీతంగా తరలివచ్చారు. ఉదయం వెనుదిరిగి వెళ్లిపోయిన వాళ్లందరూ మళ్లీ వచ్చారు. ఆ వీడియో చూసిన ప్రజలు, ఏదైతే అది జరుగుతుంది, గొడవలైనా ఫర్వాలేదు, మనం ఓటేయకపోతే ఏదో జరిగిపోతుందన్న ఆవేశంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రజలే గొప్ప ప్రతిఘటన చూపించి ఓటేశారు. 5.30 గంటల ప్రాంతంలో ఓటేయడానికి వచ్చిన వాళ్లు వేకువజామున నాలుగున్నర గంటల వరకు ఓటేశారు. అంటే క్యాలండర్ లో తారీఖు కూడా మారిపోయింది. వెంకటేశ్వరస్వామిని చూడ్డానికి రెండుమూడు రోజులు క్యూల్లో ఉండడం లేదా? అంటూ ప్రజలే పోలింగ్ సందర్భంగా గట్టి సంకల్పం చూపించారు.
ఓ ముసలావిడ షిర్డీ నుంచి వచ్చింది. వృద్ధాశ్రమంలో ఉండే ఆవిడ చంద్రబాబే గెలవాలంటూ అంతదూరం నుంచి వచ్చి ఓటేసింది. ఓవైపు తెలంగాణలో అదే రోజు పోలింగ్ జరుగుతున్నా ఏపీకి రావడానికి పోటెత్తారు. చెక్ పోస్టులన్నీ బ్లాక్ అయిపోయాయి. మరోవైపు చూస్తే, ఈ మొత్తం ప్రహసనానికి ఎవరు బాధ్యులు? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ సక్సెసయింది? " అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.