Telugudesam: గత ఎన్నికల్లో కూడా జగన్ 143 సీట్లు వస్తాయన్నాడు, అన్నీ తుస్సుమన్నాయి: ఆదినారాయణరెడ్డి
- వైసీపీది అతి విశ్వాసం
- 2014లో ఇదే తీరుతో భంగపడ్డారు
- అదనపు ఈవీఎంలు ఉంటే పోలింగ్ సకాలంలో ముగిసేది
ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కూడా జగన్ ఇలాగే అతి విశ్వాసం ప్రదర్శించి భంగపడ్డారని విమర్శించారు. అప్పట్లో 143 సీట్లు గెలుస్తున్నాం అంటూ లెక్కలు కట్టారని, ఆపై అవన్నీ తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారని, ఈసారి అదే ఫలితం తప్పదని అన్నారు. తాజా ఎన్నికల్లో గెలుపుపై వైసీపీది అతివిశ్వాసం తప్ప మరొకటి కాదన్నారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ గురించి చెబుతూ, అదనపు ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్టయితే పోలింగ్ సకాలంలో ముగిసేదని అభిప్రాయపడ్డారు. ఈసీ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఏపీలో చోటుచేసుకున్న పరిస్థితులు ఇతర రాష్ట్రాల పోలింగ్ సందర్భంగా జరగకూడదని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.