Chandrababu: 2014లో చంద్రబాబు ఇవే ఈవీఎంలతో గెలవలేదా?: పీవీపీ సూటిప్రశ్న
- ఈవీఎంల గురించి అప్పుడెందుకు మాట్లాడలేదు?
- యూటర్న్ అంటే చంద్రబాబే
- కోల్ గేట్ స్కాంలో నాపై ఆరోపణలు చేశారు
విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి 'పీవీపీ' వరప్రసాద్ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. తెలుగు డిక్షనరీలో యూటర్న్ అనే పదానికి అసలైన అర్థం చంద్రబాబేనని మండిపడ్డారు. ఈవీఎంలు లోపభూయిష్టం అని ఎలుగెత్తుతున్న చంద్రబాబు, 2014లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినప్పుడు ఉన్నది ఇవే ఈవీఎంలు కాదా? ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా? అని పీవీపీ ప్రశ్నించారు.
అంతేకాకుండా, గతంలో చంద్రబాబు తనపై కోల్ గేట్ కుంభకోణంలో ఆరోపణలు చేశారని పీవీపీ మండిపడ్డారు. ఆ కుంభకోణంలో ఉన్నది వై.హరిశ్చంద్రప్రసాద్ అయితే, ఆయనకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబేనని తెలిపారు. సీబీఐ చార్జిషీటులో తన పేరు లేకపోయినా తననే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.