Chandrababu: ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు: అవంతి శ్రీనివాస్
- రాజకీయాలు దిగజారిపోవడానికి బాబే కారణం
- రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
- పోలింగ్ అంటే ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ బాధ్యత ఉంటుంది
భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ సీఏం చంద్రబాబునాయుడిపై విమర్శలు చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు వైసీపీపై విమర్శలు ఆపడంలేదని అన్నారు. ఓటమిభయంతోనే వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు ఏపీలో హంగామా చేస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు.
చంద్రబాబు విధానాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అవంతి విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని చెప్పి, ఇప్పుడు బీజేపీని ఓడించాలంటున్నారని వివరించారు. ప్రతిదానికీ ఈసీపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, పోలింగ్ నిర్వహణలో ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ బాధ్యత ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు.