chandrababu: డీజీపీ ఆఫీసుకు సీఎస్ ఎందుకు వెళ్లారు? ఏం చేయడానికి వెళ్లారు?: చంద్రబాబు
- బీజేపీ, వైసీపీలకు ఈసీ కొమ్ముకాసింది
- టీడీపీ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు యత్నించింది
- రౌడీలు, నేరస్తులు ఈసీ కార్యాలయంలో స్వేచ్ఛగా సంచరించారు
ఎన్నికల సంఘంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఈవీఎంలు మొరాయించడం వల్ల సాక్షాత్తు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీనే ఓటు వేయలేకపోయారని చెప్పారు. ఈవీఎంలు విఫలమయ్యాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరేముంటుందని అన్నారు.
గురువారం సాయంత్రం డీజీపీ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎందుకు వెళ్లారని, ఏం చేయడానికి వెళ్లారని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీలకు ఈసీ కొమ్ముకాసిందని, టీడీపీ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు యత్నించిందని ఆరోపించారు. రౌడీలు, నేరస్తులు ఈసీ కార్యాలయంలో స్వేచ్ఛగా సంచరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాలన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు.