Ambati Rambabu: చంద్రబాబు రోజురోజుకు చిత్రంగా వ్యవహరిస్తున్నారు: అంబటి రాంబాబు

  • తెలియకుండానే ఓటమి సంకేతాలు పంపిస్తున్నారు
  • ఈవీఎంలో ఎవరికి ఓటేసిందీ అర్థం కావడంలేదట!
  • సీఎస్ వెళ్లి డీజీపీని కలవడం తప్పెలా అవుతుంది?

వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరైన అంబటి రాంబాబు పోలింగ్ సరళిపై వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అన్నారు. దీన్ని ఈసీ ప్రకటించాల్సి ఉందన్నారు. అయితే, ఈ ఓటింగ్ శాతం పెంపు ప్రభుత్వ వ్యతిరేకతను చాటిచెప్పబోతోందని తాము విశ్వసిస్తున్నట్టు తెలిపారు. దుష్ట పరిపాలన అంతం చేసి, వైసీపీని గెలిపించబోతున్నారని ప్రజల స్పందనను బట్టి అర్థమవుతోందని అంబటి పేర్కొన్నారు.

ప్రజల స్పందన మాత్రమే కాకుండా చంద్రబాబునాయుడి గారి స్పందన చూసినప్పుడు కూడా గెలుపు ఎవరిదో అందరికీ అర్థమైపోతుందని వ్యంగ్యం ప్రదర్శించారు.  గత కొంతకాలంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే ఓడిపోబోతున్నాడు, అధికారం నుంచి తప్పుకోబోతున్నాడు అనేలా చంద్రబాబు తనకు తెలియకుండానే ఓటమి సంకేతాలు పంపిస్తున్నారని అంబటి వివరించారు. ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి పోలింగ్ నాటి వరకు చంద్రబాబు ప్రవర్తన పరిశీలిస్తే చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు, చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు అంటూ అంబటి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈసీ వద్దకు వెళ్లి బెదిరించే పరిస్థితి వచ్చిందని, అధికారులను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. ఐపీఎస్ ఆఫీసర్లను కొనేశారు అనే మాట చాలా తప్పు అని అంబటి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదని అన్నారు. చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారని, రేపు ఆయన ఏమవుతారన్నది వేరే విషయం అని అన్నారు. "అలాంటి వ్యక్తి ఐఏఎస్ లు కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారని, సీఎస్ వెళ్లి డీజీపీ వద్ద కూర్చోవడం ఏంటి? అని అడుగుతున్నారు, అసలేం మాట్లాడుతున్నారు మీరు? సీఎస్ రాష్ట్ర డీజీపీ వద్దకు వెళ్లాడంటే అది వాళ్ల అంతర్గత విధుల్లో భాగం కావచ్చు. దాన్ని మీరు తప్పుబట్టాల్సిన అవసరం ఏముంది? అధికారులందరినీ ఇది దూషించే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఎలాగూ తాను దిగిపోతున్నాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు.

హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంలో ఓటు వేస్తే ఎవరికి వేసిందీ అర్థం కావడంలేదట! మరి వీవీ ప్యాట్లు ఉన్నాయిగా. అందులో చూసుకోవచ్చు కదా! నేను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే వీవీ ప్యాట్ స్లిప్ కనపడింది కూడా. నిజంగానే ఈవీఎంలు పనిచేయకపోతే ఇంత పర్సెంటేజీతో ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఏదో పిచ్చిబట్టినట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మీడియా చూపిస్తోంది కాబట్టి చంద్రబాబు ఇష్టంవచ్చినట్టు ముందుకెళుతున్నారు" అంటూ అంబటి తీవ్రంగా స్పందించారు.

More Telugu News