Chandrababu: జగన్ 'హాలిడే' అన్నాడంటే మాకు డౌట్ వచ్చేది... అలాంటిది మూడు రోజులు హాలిడే తీసుకున్నాడు: చంద్రబాబు
- ఈసీని మీ కుట్రల్లో భాగం చేశారు
- ఈసీ ఏంచేసినా మీకు ఆమోదయోగ్యమా?
- పోలింగ్ పూర్తికాకుండానే మీడియా సమావేశం ఎలా పెట్టారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షనేత జగన్ మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలు సరిగా పనిచేయని పరిస్థితులపై జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంలో ఉన్న అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు.
"మీ ఉద్దేశపూర్వక చర్యల్లో ఇదొకభాగం. ఎన్నికల సంఘం, మీరు కలిసి చేశారు కాబట్టి ఒక్క మాట కూడా అనడంలేదు. పోలింగ్ రోజున ఈసీ ఏంచేసినా మీకు ఆమోదయోగ్యం అయింది. సాయంత్రం పోలింగ్ కూడా పూర్తికాకముందే లోటస్ పాండ్ లో మీడియా సమావేశం పెడతాడు, పోలింగ్ పూర్తికాకుండానే ఏవిధంగా విజయావకాశాలపై అంచనాకు వస్తాడు?" అంటూ నిలదీశారు.
"సాధారణంగా జగన్ సాయంత్రం ఆరు, ఏడింటికల్లా హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ్నించే కుట్రలు, కుతంత్రాలు చేస్తాడు. ఈ పనులు చేయడానికి మూడు రోజులు సెలవు తీసుకున్నాడు. డబ్బులు వసూలు చేయడం, ఈవీఎంల్లో మార్పులు చేయడం, రౌడీయిజం చేయడం వీటికోసమే సెలవు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ నాయకుడు 3 రోజులు హాలిడే తీసుకోవడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అతను హాలిడే అన్నప్పుడల్లా మాకు డౌట్! ఏదో చేయబోతున్నాడని అనుకునేవాళ్లం" అంటూ వ్యాఖ్యలు చేశారు.