Chandrababu: పునేఠాను మార్చి జగన్ సహనిందితుడ్ని సీఎస్ గా తీసుకువస్తారా?: నిలదీసిన చంద్రబాబు
- ఓటర్ అంటే లెక్కలేదా మీకు?
- మీది విచ్చలవిడితనం
- రాష్ట్ర చరిత్రలో ఇంత హింస ఎప్పుడూ లేదు
ఎన్నికల సంఘానికి ఈ దేశం పట్ల ఏమాత్రమైనా అంకితభావం ఉందా? మీరు చేస్తున్న ఉద్యోగం పట్ల మీకు అంకితభావం ఉందా? మీ విచ్చలవిడితనానికి హద్దుల్లేవా? ప్రజాస్వామ్యం అన్నా, ఓటర్ అన్నా మీకు లెక్కలేదా? వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పోలింగ్ సందర్భంగా జరిగిన తీవ్ర పరిణామాలపై ఎన్నికల సంఘాన్ని నిలదీశారు.
అనిల్ చంద్ర పునేఠా వంటి వ్యక్తిని సీఎస్ గా తొలగించి జగన్ కేసుల్లో సహనిందితుడిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్ గా తీసుకురావడం ఏంటని చంద్రబాబు మండిపడ్డారు. "మీకు అధికారం ఉందని ఇష్టప్రకారం చేస్తారా? శాంతిభద్రతల సమస్య సరిదిద్దాల్సి ఉంటే సీఎస్ కాస్తా డీజీ వద్దకు వెళతాడా? మీరందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టంవచ్చినట్టు ఖూనీచేస్తారా? రాష్ట్ర చరిత్రలో పోలింగ్ సందర్భంగా ఇంత హింస ఎప్పుడూ జరగలేదు" అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
"శాంతికి మారుపేరుగా ఉండే శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా హింస చోటుచేసుకుంది. రౌడీలను పంపించి ఇష్టానుసారంగా మరో బీహార్ లా మార్చేశారు. బీహార్ లో జరిగే వాటిని ప్రశాంత్ కిషోర్ మన రాష్ట్రానికి తీసుకువస్తే, పులివెందులలో 40 ఏళ్లుగా అన్నింటిని ఔపోసన పట్టిన జగన్ ఇప్పుడు వాటినే రాష్ట్రం మొత్తం తీసుకువచ్చాడు" అని ఆరోపించారు.