Andhra Pradesh: ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది: ద్వివేది
- 80 శాతానికి చేరువలో ఓటింగ్
- 400 కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
- పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తిన ఓటర్లు
రాష్ట్రంలో 80 శాతానికి చేరువలో పోలింగ్ నమోదు కావచ్చంటున్నారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఓటర్లు మళ్లీ సాయంత్రం పోలింగ్ కేంద్రాల వద్దకు రావడంతో తాకిడి పెరిగింది. ఈ కారణంగా 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరుగుతోంది. దీనిపై ద్వివేది స్పందిస్తూ, ఓటర్ల సంఖ్యను బట్టి అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. నిర్దేశిత సమయం తర్వాత క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.