EC: దేశంలో మొదటి ఎన్నికలకు, ఇప్పటి ఎన్నికలకు ఖర్చు పరిమితిలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి!
- 1951-52లో తొలి ఎన్నికలు
- పెద్ద రాష్ట్రాల్లో పాతికవేలు, చిన్న రాష్ట్రాల్లో రూ.10 వేలు
- 2019లో పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలు
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి గణతంత్ర దేశంగా ఏర్పడ్డాక తొట్టతొలి ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఆ సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలో స్పష్టమైన పరిమితి విధించారు. పెద్ద రాష్ట్రాల అభ్యర్థులు రూ.25000 కి మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరాదని ఆదేశించారు. చిన్న రాష్ట్రాల అభ్యర్థులు రూ.10,000 వరకు ఖర్చు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆ తర్వాత 1962లో దేశం మొత్తం ఒకే పరిమితి విధిస్తూ అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు రూ.10,000 పరిమితి విధించారు.
ఆ పరిమితి 1980 ఎన్నికల సందర్భంగా మొదటిసారి లక్ష రూపాయలకు చేరింది. ఆ ఎన్నికల సందర్భంగా పెద్ద రాష్ట్రాల్లో అభ్యర్థులు లక్ష, చిన్న రాష్ట్రాల అభ్యర్థులు రూ.75,000 ఖర్చుచేసుకోవచ్చని నియమావళిలో పేర్కొన్నారు. ఇక, 2019 నాటికి వచ్చేసరికి ఆ ఖర్చు కాస్తా రూ.70 లక్షలకు చేరింది. పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా అభ్యర్థులకు పరిమితి విధించారు.