Chandrababu: హత్యకేసు విచారణ చేస్తున్న కడప ఎస్పీ ఏ నియామవళి ఉల్లంఘించారని బదిలీ చేశారు?: ఈసీకి చంద్రబాబు సూటి ప్రశ్న
- ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది
- వైసీపీ నేతల జేబుసంస్థలా మారిపోయింది
- సీఈవోను కలిసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘాన్ని కలిసి తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. కొన్నిరోజులుగా అధికారులను ఈసీ బదిలీ చేస్తుండడం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి అంశాలవారీగా తమ అసంతృప్తిని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎన్నికల సంఘం తీరును తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు అధికారులను బదిలీ చేశారంటూ మండిపడ్డారు.
ఈసీ పరిధిలో ఏవైనా ఉల్లంఘనలు జరిగినప్పుడు బదిలీలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, కానీ తమ పరిధిని దాటీ ఈసీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కడపలో జరిగింది హత్య, దానిపై జిల్లా ఎస్పీ విచారణ చేస్తున్నారు, అందులో ఏ నియామవళి ఉల్లంఘన జరిగిందని జిల్లా ఎస్పీని బదిలీ చేస్తారు?' అంటూ సూటిగా ప్రశ్నించారు.
"ఉదయం గుండెపోటు అని చెప్పారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం జరిగితే హత్య అని తేలింది. దాంతో వాళ్లు భయపడిపోయి ఓ లేఖను తీసుకొచ్చి ఆ నేరాన్ని డ్రైవర్ మీదకు నెట్టేశారు. ఆ తర్వాత ఏంచేయాలో తెలియక ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి, ఆపై కేంద్ర హోంమంత్రిని కలిసి, కోర్టుకెళ్లారు. ఎందుకెళ్లాల్సి వచ్చింది? జరిగింది ఇదైతే మీరు జిల్లా ఎస్పీని ఎందుకు బదిలీ చేశారు? ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ల కోసం మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా?
సీఎస్ విషయంలోనూ మీరు ఇలాగే ప్రవర్తించారు. ముఖ్యమంత్రికి, రాష్ట్ర యంత్రాంగానికి మధ్య వారధిలా ఉండే వ్యక్తిపై మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కొందరు నేతలు ఉదయం ఢిల్లీ వెళుతున్నారు, సాయంత్రానికి బదిలీ ఉత్తర్వులు వస్తున్నాయి, ఇంకో క్యాండిడేట్ రేపు సాయంత్రానికి ఎస్పీ మారిపోతాడు అని చెబుతాడు, నిజంగానే ఎస్పీ మారిపోతున్నాడు. ఏం జరుగుతోందక్కడ?
అవతలి పక్షం నేతలపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలాంటివారిని వదిలిపెట్టి టీడీపీ నాయకులపై ఏకపక్ష దాడులు చేస్తున్నారు. శిద్ధా రాఘవరావు, గల్లా జయదేవ్ కు చెందినవారిపై దాడులు జరిగాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ అసిస్టెంట్ గోపీ రూ.8 కోట్లు డ్రా చేసి తీసుకెళుతుంటే ఏం చర్యలు తీసుకున్నారు? కర్నూల్ లో వైసీపీ నేతలు డబ్బులు వెదజల్లుతున్నారు. విజయసాయిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సునీతారెడ్డి ఎన్నికల సంఘం తమ జేబుసంస్థ మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఎవరిపై చర్యలు తీసుకోమని చెబితే వాళ్లపై చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది" అంటూ విమర్శలు చేశారు.