Chandrababu: ఇది మా మామగారి నియోజకవర్గం... అత్తగారు కూడా కొమరోలుకు చెందినవారే: పామర్రులో చంద్రబాబు
- చంద్రబాబు లోకల్ టచ్!
- పామర్రు పట్ల బాధ్యత తీసుకుంటా
- ఓట్ల రూపంలో కృతజ్ఞత తెలుపుకోండి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పామర్రు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి మరొక్కరోజు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో, వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేందుకు ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పామర్రు సభలో ఆయన మాట్లాడుతూ, కుప్పం తర్వాత పామర్రు నియోజకవర్గానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇది తన మామ గారి నియోజకవర్గం అని, తన అత్తగారు కూడా ఇదే నియోజకవర్గంలోని కొమరోలుకు చెందనివారని తెలిపారు. అందుకే పామర్రు నియోజకవర్గం అంటే తనకు ప్రత్యేక అభిమానం అని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన నందమూరి తారకరామారావు స్వస్థలం నిమ్మకూరు పామర్రు మండలంలోనే ఉంది. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లాడడంతో చంద్రబాబుకు కూడా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. అందుకే ఆయన తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.