Jagan: అటు హెరిటేజ్ డెయిరీ, ఇటు విశాఖ డెయిరీ రైతుల రక్తాన్ని పీల్చుతున్నాయి: జగన్
- విశాఖ డెయిరీ యాజమాన్యంపై విరుచుకుపడిన వైసీపీ అధినేత
- రైతుల సంక్షేమం పేరుతో అయినవాళ్లకు దోచిపెడుతున్నారు
- ప్రచారంలో స్థానిక సమస్యలపైనే దృష్టి
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ అనకాపల్లిలో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగం ఆరంభం నుంచి విమర్శల దాడి మొదలుపెట్టారు. ఆయన ఎక్కువగా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విశాఖ డెయిరీ అంశాన్ని ఎత్తి చూపారు. విశాఖ డెయిరీ పెద్దలు రైతుల సంక్షేమం కోసం అని చెప్పి ఒక ట్రస్టు, ఒక స్కూలు ఏర్పాటు చేస్తారని, కానీ ఆ స్కూలును నారాయణ యాజమాన్యానికి అప్పగించేస్తారని జగన్ ఆరోపించారు. రైతుల ఆరోగ్యం కోసం అంటూ ఆసుపత్రి కడతారని, కానీ ఆ ఆసుపత్రిని కిమ్స్ కు అప్పగించేస్తారని అన్నారు.
విశాఖ డెయిరీ ఓ కుటుంబానికి సంబంధించిన సంస్థలా ఉంది తప్ప రైతుల కోసం ఏర్పాటైన సంస్థలా లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడితో కలిసి ఓవైపు నుంచి హెరిటేజ్ డెయిరీ, మరోవైపు నుంచి విశాఖ డెయిరీ రైతుల రక్తాన్ని పీల్చుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సహకార రంగంలో ఉండే డెయిరీలు రైతులకు మేలు చేస్తాయని భావిస్తారని, కానీ, ఇక్కడ కోఆపరేటివ్ డెయిరీలను నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు తన మాటలు వినే నాయకులను డెయిరీ చైర్మన్లుగా చేస్తారని, తద్వారా లీటర్ మినరల్ వాటర్ కొన్నా రూ.22, లీటర్ పాలు కొన్నా రూ.23 అయ్యే పరిస్థితుల్లోకి రైతులను తీసుకెళుతున్నారంటూ నిప్పులు చెరిగారు.