Chandrababu: మాగుంట వణికిపోతూ నా దగ్గరికి వచ్చి ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పాడు: చంద్రబాబు
- మాగుంట వణికిపోయాడు
- బెదిరిస్తున్నారని చెప్పాడు
- ఏం చేయమంటారని నన్నే అడిగాడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా కందుకూరులో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరి నిమిషంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన మాగుంట శ్రీనివాసులురెడ్డిపై విమర్శలు చేశారు.
"నెల్లూరు జిల్లాకు చెందినవాడే మరో గొప్పనాయకుడు ఉన్నాడు. ఆయన పేరు మాగుంట. ఓరోజు వణికిపోతూ నా దగ్గరికి వచ్చాడు. సార్ బెదిరిస్తున్నారు, ఈడీ అంట, ఐటీ అంట! ఇంట్లో వాళ్లు కూడా ఒత్తిడి చేస్తున్నారు సార్, బీపీ పెరిగిపోతోంది, నిద్ర కూడా రావడంలేదు అని చెప్పాడు. ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పాడు.
ఇంత పిరికివాడైతే రాజకీయాల్లో ఏం చేస్తాడు? అనుకున్నాను. 40 ఏళ్ల నుంచి ఉన్నావు, ఇంత అధైర్యపడితే ఎలా అన్నాను. బెదిరిస్తే ఏం చేయమంటారు సార్? అంటూ ఎదురుప్రశ్నించాడు. మరి నేను బెదిరిస్తే ఏంచేస్తావ్? అని అడిగాను" అంటూ మాగుంట గురించి చెప్పుకొచ్చారు. ఇలాంటి పిరికివాళ్లు తనకు అక్కర్లేదని చంద్రబాబు నిర్మొహమాటంగా చెప్పారు.