Chandrababu: టీడీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఓ ఇంజినీరింగ్ కుర్రాడి గురించి చెప్పిన చంద్రబాబు
- రైతుల కష్టాలు తొలగించాలని ఆనాడే నిర్ణయం
- ఒక ఎరువు బస్తా కోసం లాఠీ దెబ్బలు తిన్న రైతులను చూశాను
- పాదయాత్రలో ఎన్నో సమస్యలు గుర్తించాను
తెలుగుదేశం పార్టీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేసింది. ఉగాది రోజున సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ మేనిఫెస్టో వివరాలను వెల్లడించారు. మీ భవిష్యత్ నా బాధ్యత పేరుతో వచ్చిన ఈ మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రూపొందించారు. మీడియాకు వివరాలు తెలిపే క్రమంలో చంద్రబాబు తనను ఆలోచింపజేసిన కొన్ని దృష్టాంతాలను తెలిపారు.
కొన్నాళ్ల క్రితం ఓ కుర్రాడ్ని చూశానని, వ్యవసాయ పంపుసెట్ వద్ద అతను చలిమంట వేసుకుని కూర్చున్నాడని తెలిపారు. ఆ కుర్రాడి వద్దకు వెళ్లి వివరాలు అడిగితే, ఇంతకుముందు తన తండ్రి పంపు సెట్ వద్ద ఉండేవాడని, ఇంజినీరింగ్ చదువుతున్న తాను సెలవుల్లో ఇంటికి వచ్చి తండ్రి రుణం తీర్చుకునేందుకు రాత్రివేళ పంపు సెట్ వద్ద ఉన్నానని చెప్పాడని చంద్రబాబు వివరించారు.
అయితే, తనకు భయంగా ఉందని, పాములు కరిచి చనిపోయిన ఉదంతాలు పేపర్ లో చూశానని ఆ కుర్రాడు చెప్పడం చూసి తాను పగటి పూట కరెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని సీఎం చెప్పారు. అప్పట్లో 4000 కరెంట్ షాక్ చావులు, 4000 పాముకాటు మరణాలు సంభవించాయని, ఇవన్నీ ఉండకూడదంటే పగటిపూట విద్యుత్ ఇవ్వాల్సిందే అని భావించి చెప్పింది చేశామని చంద్రబాబు ఉద్ఘాటించారు.
అంతేగాకుండా, అప్పట్లో రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వచ్చిందని, తమ చెప్పులు విడిచి క్యూలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. ఆనాడు, పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో రైతులపై లాఠీచార్జ్ చేశారని, రైతు ఒక లాఠీ దెబ్బ తిని ఒక ఎరువు బస్తా ఇంటికి తెచ్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ ప్రాంతంలో మైళ్లదూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవడం పాదయాత్ర సమయంలో చూశానని గుర్తుచేసుకున్నారు. ఇలాంటివన్నీ మేనిఫెస్టో రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయని అన్నారు.