Andhra Pradesh: సీఎస్ బలికావడానికి చంద్రబాబే కారణం: జీవీఎల్
- ఎన్నికల సంఘం ఆదేశాలు సీఎస్ పాటించలేదు
- అస్త్రాలకు పదునుపెడుతున్న బీజేపీ
- బదులిచ్చిన జూపూడి
ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల బదిలీలు, నేతలపై ఐటీ దాడులతో ఆగ్రహంతో రగిలిపోతున్న టీడీపీకి ఇది మరో ఆశనిపాతంలాంటి పరిణామం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో, ప్రత్యర్థులు అప్పుడే తమ అస్త్రాలకు పదునుపెట్టారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు సీఎస్ బదిలీపై స్పందిస్తూ, సీఎస్ పునేఠా బలికావడానికి చంద్రబాబునాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలు పాటిస్తూ, ఎన్నికల సంఘం ఆదేశాలు బుట్ట దాఖలు కావడానికి సీఎస్ పరోక్షంగా కారణమయ్యాడని విమర్శించారు.
దీనిపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని తిరగకుండా చేయడం కోసం, ముఖ్యమంత్రిని శక్తిహీనుడ్ని చేయడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తమకు అనుకూలంగా ఉన్న కీలుబొమ్మ వ్యవస్థ ద్వారా తీసుకున్న నిర్ణయాలు అని విమర్శించారు. ఎన్నికల సంఘానికి వెన్నెముక లేదని అన్నారు.