Chandrababu: హైదరాబాద్ నుంచి వచ్చిన వలసపక్షులకు క్యారక్టర్ ఉందా?: నిలదీసిన చంద్రబాబు
- కేసీఆర్ కు భయపడి మనమీదకు వస్తున్నారు
- రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీళ్లంతా ఏమయ్యారు?
- పెదనందిపాడులో సీఎం రోడ్ షో
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా పెదనందిపాడులో రోడ్ షో నిర్వహించారు. అసెంబ్లీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్ కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, జగన్ తల్లి ఒక్క చాన్స్ ఇమ్మని అడుగుతున్నారని, చెల్లెలు షర్మిల ఒక్క చాన్స్ ఇమ్మంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన వలసపక్షులు కూడా ఒక్క చాన్స్ ఇమ్మని అడుగుతున్నారని, అసలు వీళ్లకు క్యారక్టర్ ఉందా? అని నిలదీశారు.
"ఈ వలసపక్షులు హైదరాబాద్ లో కేసీఆర్ కు భయపడి మనమీదకు వస్తున్నారు. తిత్లీ తుపాను వచ్చినప్పుడు వీళ్లెక్కడికి వెళ్లారు? హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు వీళ్లేమయ్యారు? నరేంద్ర మోదీ ఐటీ దాడులు చేయిస్తుంటే వీళ్లెందుకు రాలేదు? రాష్ట్రం కోసం ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ దగ్గర పనులు జరిపించుకోవడం కోసం వస్తున్నారు, లంచాలు తీసుకుని మరీ వస్తున్నారు. మన దగ్గరికి వచ్చి పెత్తనం చేయడానికి వస్తున్నారు. గొప్పవ్యక్తులు వీళ్లు! మనకు ఇబ్బందులు ఉంటే కనపడలేదు కానీ ఇప్పుడొచ్చి కథలు చెబుతున్నారు" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.