Jagan: టీడీపీ అరాచక పాలనలోనే నా పాదయాత్ర సాగింది: జగన్
- వీళ్లసలు మనుషులా!
- పేదలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు
- మీ అందరికీ నేనున్నాను
మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారపర్వం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఆయన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ టీడీపీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఎక్కువగా స్థానిక సమస్యలపై దృష్టి సారించిన జగన్, సీఎం చంద్రబాబు, మంత్రి కాల్వ శ్రీనివాసులును లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలో 20 మంది రైతులు చనిపోతే 11 మంది అని టీడీపీ అవాస్తవాలు చెబుతోందని మండిపడ్డారు. నష్టపరిహారం కూడా అందరికీ అందించకుండా కొందరికే ఇచ్చారని ఆరోపించారు.
రైతులకు మంచి చేయాలన్న ఆలోచన కంటే వేదవతి నది నుంచి ఇసుక ఎలా దోచేయాలన్న దానిపైనే చంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు ధ్యాస అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లసలు మనుషులేనా? అని ప్రశ్నించిన జగన్, తాను 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది కూడా టీడీపీ అరాచకపాలనలోనే అని, తనకు అన్ని సమస్యలు తెలుసని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత అనంతపురం జిల్లా వ్యవసాయరంగాన్ని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారని జగన్ విమర్శించారు.