Chandrababu: ఇకమీదట ఐదేళ్లలో మూడుసార్లు పసుపు-కుంకుమ: అద్దంకి సభలో చంద్రబాబు హామీ
- పండుగలకు రెండు సిలిండర్లు ఫ్రీ
- కోటిమందికి స్మార్ట్ ఫోన్లు
- ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అద్దంకి సభలో ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించారు. ఇకమీదట డ్వాక్రా మహిళల కోసం ఐదేళ్ల వ్యవధిలో మూడు పర్యాయాలు పసుపు-కుంకుమ నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మూడో విడత పసుపు-కుంకుమ డబ్బులు రేపటి నుంచే తీసుకోవచ్చని అన్నారు.
అంతేగాకుండా, పండుగ సందర్భాల్లో రెండు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. కోటిమందికి స్మార్ట్ ఫోన్లు ఇస్తానని, చంద్రన్నా, ఈ సమస్య ఉందంటూ ఆ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కితే ఆ పని పూర్తిచేసే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్పింది చేస్తానని అన్నారు.
మరోవైపు, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకునేందుకు మరికొన్ని విడతల్లో నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రూ.1000లతో ప్రారంభించి నిరుద్యోగ భృతి రూ.2000 చేశానని, భవిష్యత్తులో అది రూ.3000 చేస్తానని చెప్పారు. ఇకపై ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.