BJP: ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అంబేద్కర్ మనవడు
- ఈసీది పక్షపాత ధోరణి
- బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది
- అధికారంలోకి వస్తే జైల్లో పెడతాం
కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిపై దేశంలోని పలుచోట్ల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సైతం ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రెండ్రోజుల పాటు ఈసీని జైల్లో పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరిప బహుజన్ మహాసంగ్ చైర్మన్ హోదాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, పుల్వామా దాడి ఘటన పట్ల ప్రచారంలో మాట్లాడనీయకుండా నోరు నొక్కేస్తున్నారంటూ ఈసీపై విమర్శలు చేశారు.
రాజ్యాంగం ప్రకారం నియమాలు అంగీకరిస్తున్నా, పుల్వామా పట్ల స్పందించకూడదని అభ్యంతరం చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈసీ అన్ని పార్టీల పట్ల ఒకే తీరుగా వ్యవహరించడంలేదని, బీజేపీకి కొమ్ముకాస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. ప్రకాశ్ అంబేడ్కర్ ఈ ఎన్నికల్లో షోలాపూర్, అకోలా లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.