Andhra Pradesh: చంద్రబాబు ఇంటికి హెలికాప్టర్లలో డబ్బులు వస్తున్నాయ్.. ఇదంతా ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తోంది!: సి.రామచంద్రయ్య ఆరోపణ
- తనను కాపాడాలని చంద్రబాబు కోరడం విడ్డూరం
- లోకేశ్ డబ్బుమూటల కోసమే పారిశ్రామికవేత్తలను కలిశారా?
- విజయవాడలో మీడియా సమావేశంలో వైసీపీ నేత
వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి హెలికాప్టర్ లో డబ్బులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ తతంగమంతా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తోందని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ఏమాత్రం గౌరవించని చంద్రబాబు.. ఇప్పుడు అవి తనపై పెత్తనం చేయాలనుకుంటున్నాయని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు.
తనను కాపాడాలని ఏపీ ప్రజలకు చంద్రబాబు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల విశాఖలో కొందరు పారిశ్రామికవేత్తలను కలిశారని ఆయన చెప్పారు. లోకేశ్ ఆ పారిశ్రామికవేత్తలను కలిసింది డబ్బు మూటల కోసమేనా? కాదా? అన్న విషయమై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సినీ తారలను రాజకీయాల్లోకి తెచ్చి ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు వైసీపీ అద్దె తారలను ప్రచారానికి దింపుతోందని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.