Congress: రాహుల్ గాంధీ బయోపిక్ తీస్తే షూటింగ్ మొత్తం థాయ్ లాండ్ లో జరపాలేమో!: వివేక్ ఓబెరాయ్ సెటైర్
- ఏం సాధించారని బయోపిక్?
- మోదీపై బయోపిక్ పై కాంగ్రెస్ నేతలది ఓవరాక్షన్
- చానల్ డిబేట్ లో వివేక్ ఓబెరాయ్ విమర్శలు
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ హిందీ చిత్రాలే కాదు, 'రక్తచరిత్ర', 'వినయ విధేయ రామ' వంటి టాలీవుడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తండ్రి సురేష్ ఓబెరాయ్ నుంచి నటన వారసత్వంగా అందుకున్న వివేక్ తాజాగా నరేంద్ర మోదీ బయోపిక్ లో నటించారు. అయితే కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో ఆ సినిమా విడుదల శుక్రవారం నుంచి ఏప్రిల్ 12కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, వివేక్ ఓబెరాయ్ కాంగ్రెస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఓ టీవీ చానల్ డిబేట్ లో పాల్గొన్న వివేక్ దీనిపై స్పందిస్తూ, మోదీ బయోపిక్ పై కొందరు ఎందుకింత అతిగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదని అన్నారు. ఈ సినిమా వల్ల మోదీకి ఓట్లు పడతాయన్న నమ్మకం కూడా లేదని, అలాంటప్పుడు విడుదలను అడ్డుకోవడం అర్థరహితం అని వ్యాఖ్యానించారు.
ఈ దశలో టీవీ హోస్ట్ వివేక్ ను రాహుల్ గాంధీ బయోపిక్ పై ప్రశ్నించారు. దాంతో, వివేక్ వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు, రాహుల్ గాంధీ సాధించింది ఏమైనా ఉంటే కదా! ఏమీ సాధించకుండా బయోపిక్ లో ఏంచూపించాలి? రాహుల్ బయోపిక్ తీయాల్సి వస్తే మాత్రం షూటింగ్ అంతా థాయ్ లాండ్ లోనే జరపాలేమో! అంటూ ఎద్దేవా చేశారు. వివేక్ కామెంట్లపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వివేక్ ఓ ఫ్లాప్ హీరో అని, ఓ ఫ్లాప్ ప్రొడ్యూసర్ తో కలిసి నకిలీ సినిమా తీసి ఏదో గొప్ప చిత్రం చేసినట్టు ఫీలైపోతున్నాడని విమర్శించారు.