Jagan: ఎన్నికలు వస్తే చాలు చంద్రబాబు అన్నిరకాల స్కీంలతో సిద్ధంగా ఉంటారు: జగన్
- అమ్ముడుపోయిన మీడియా బాబుకు అండగా నిలుస్తోంది
- కలసికట్టుగా మోసాలకు పాల్పడుతున్నారు
- పిడుగురాళ్ల రోడ్ షోలో విమర్శలు చేసిన వైసీపీ చీఫ్
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియాలోని ఓ వర్గం చంద్రబాబుకు అమ్ముడుపోయిందని, ఆ మీడియా సాయంతో చంద్రబాబు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు అన్ని రకాల స్కీంలతో ప్రజలను వంచించడానికి తయారుగా ఉంటాడని, మీడియాలో అమ్ముడుపోయిన వర్గం అతనికి అండగా నిలుస్తుందని మండిపడ్డారు. 1994 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే మోసం చేశాడని, రూ.2లకే కిలో బియ్యం ఇస్తామని, అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తామని చెప్పి ఓట్లేయించుకున్నారని విమర్శించారు. అయితే, గెలిచిన తర్వాత 1995లో కిలో బియ్యం ధర రూ.5.25 అయిందని, మద్యనిషేధాన్ని ఎత్తివేశారని తెలిపారు. చంద్రబాబు అనుకూల మీడియాలో ఇలాంటి విషయాలేవీ రావని ఆరోపించారు.