: నేటి నుంచి డ్రీం లైనర్ విమాన సర్వీసులు
జనవరిలో నిలిపేసిన డ్రీం లైనర్ విమానయాన సేవల్ని ఎయిర్ ఇండియా నేటి నుంచి పునరుద్ధరించనుంది. కోల్ కతా, ఢిల్లీ మార్గంలో మొట్టమొదటి వాణిజ్య విమానం విహరించడం మొదలు పెడుతుందని కేంద్ర పౌర విమాన యాన శాఖా మంత్రి అజిత్ సింగ్ తెలిపారు. జనవరిలో బ్యాటరీల్లో మంటలు రేగడంతో ఈ సర్వీసులను నిలిపివేసారు. అయితే ఎయిర్ ఇండియా వద్ద ఉన్న 6 బోయింగ్ 787 రకం డ్రీం లైనర్ విమానాల్లో రెండింటికి తగిన మార్పులు చేర్పులు చేసినట్టు మంత్రి వెల్లడించారు. మిగిలిన డ్రీం లైనర్ విమానాలు ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
డిసెంబరు నాటికి బోయింగ్ కంపెనీ మరో 8 డ్రీం లైనర్ విమానాలను సరఫరా చేస్తుందన్నారు. అంతర్జాతీయ విమాన సేవలను ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఢిల్లీ- బర్మింగ్ హోమ్, సిడ్నీ-మెల్ బోర్న్ మధ్య ఎయిరిండియా (ఏఐ) అంతర్జాతీయ సేవలను ప్రారంభిస్తామన్నారు. ఆగస్టులో సిడ్నీ-మెల్ బోర్న్, అక్టోబర్ లో రోమ్-మిలాన్ కు ఈ సేవలను విస్తరిస్తామని తెలిపారు.