Andhra Pradesh: ఎమ్మెల్యే బుడ్డా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ.. శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత

  • ఆత్మకూరులో ఎమ్మెల్యే రోడ్ షో 
  • టపాసులు కాల్చి, మైకులో కేకలు వేసి గందరగోళం
  • గంటపాటు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత 

కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మంగళవారం గంటకు పైగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నంద్యాల టీడీపీ లోక్‌సభ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆత్మకూరులో రోడ్డు షో నిర్వహించారు. సాయంత్రానికి రోడ్డు షో లింగాయితివీధి నుంచి అమ్మవారిశాల వద్దకు చేరుకుంది.

సరిగ్గా అదే సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే బుడ్డా కాన్వాయ్‌ను దాటి వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో గొల్లపేట సెంటర్‌లో బుడ్డా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఇందులో భాగంగా డ్రమ్స్ మోగించారు. టపాసులు కాల్చి శబ్దాలు చేశారు. మైకుల్లో కేకలు వేశారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గమనించిన ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ రమేశ్‌బాబు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. దీంతో తోపులాట జరగడంతో వైసీపీ బృందాలు టీడీపీ కాన్వాయ్‌లోకి రాకుండా రోప్ బృందాలు అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి తన కాన్వాయ్‌ను ముందుకు కదిలించడంతో వివాదం సద్దుమణిగింది.

More Telugu News