Jagan: రెండెకరాలతో మొదలైన చంద్రబాబు ఇవాళ దేశంలోనే ధనిక సీఎం ఎలా అయ్యాడు?: జగన్
- దేశంలోనే మన రైతుపైనే అత్యధిక రుణభారం ఉంది
- నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది
- డ్వాక్రా సంఘాలపై భారం పడుతోంది
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోనే ఇవాళ చంద్రబాబునాయుడు అత్యంత ధనికుడైన చీఫ్ మినిస్టర్ గా నిలిచాడని తెలిపారు. రెండెకరాలతో మొదలైన ఆయన నేడు నంబర్ వన్ ధనిక సీఎం అయ్యాడంటే ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. దేశంలో అత్యధిక రుణభారం ఉన్న రైతుగా నాబార్డ్ ఏపీ రైతును పేర్కొంటున్న దశలో చంద్రబాబు మాత్రం ధనిక సీఎం అయ్యాడని విమర్శించారు.
మరోవైపు డ్వాక్రా మహిళలపై పాతిక వేల కోట్ల రుణభారం పెరిగిపోయిందని అన్నారు. గత ఐదేళ్లలో నిరుద్యోగులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయారని, చంద్రబాబు సంపాదన మాత్రం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. అయినా, బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? అని ప్రశ్నించారు. ఇవాళ జాబు రావాలి అంటే బాబు పోవాలి అంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు.