Chandrababu: "ప్లీజ్ ఒక్క అవకాశం!" తల్లీ అదే మాట, చెల్లీ అదే మాట!... ఇదేమన్నా చాక్లెట్టా, బొమ్మా ఒక్కసారి ఇవ్వడానికి?: చంద్రబాబు
- జగన్ పై మండిపడిన చంద్రబాబు
- ఊడిగం చేసుకోవాలనుకుంటే లోటస్ పాండ్ లోనే ఉండు
- పాయకరావుపేట రోడ్ షో
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఇవాళ రోడ్ షో నిర్వహించారు. హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జగన్ ఊడిగం చేయాలనుకుంటే హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉండాలని సూచించారు. తాను పోర్టులు, పరిశ్రమల గురించి ఆలోచిస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. జగన్ కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఇలాంటి ఆలోచనలు రానేరావని విమర్శించారు. జగన్ కు కోడికత్తి లాంటి ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు కలగవని ఎద్దేవా చేశారు.
"జగన్ ఏనాడన్నా డబ్బులు సంపాదించే మాటలు మాట్లాడాడా? సంపద సృష్టించడం ఎలాగో తెలుసా? అసలేమైనా అవగాహన ఉందా? మాట్లాడితే ఒకటే అంటాడు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటాడు. ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు. అదేంటో నాకు అర్థం కావడంలేదు. ప్రతి ఒక్కరూ వచ్చి అదే మాట్లాడుతున్నారు. తల్లీ అదే మాట, చెల్లీ అదే మాట! ఇదేమన్నా చాక్లెట్టా, బొమ్మా ఒక్కసారి ఇవ్వడానికి! ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారని ఆత్మహత్య చేసుకుంటామా? ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారని కొండపైకి ఎక్కి దూకుతామా? ఎవరు మీరు? ఏంచేశారని మీకు ఒక్క అవకాశం ఇవ్వాలి?" అంటూ మండిపడ్డారు.