BJP: నేను కాకపోతే నా దెయ్యం వచ్చి చేస్తుందా?: నెటిజన్ కు ఆసక్తికరమైన జవాబిచ్చిన సుష్మా స్వరాజ్
- ప్రతి ట్వీట్ నేనే చేస్తా
- అన్నింటికీ రిప్లయ్ ఇచ్చేది నేనే
- విదేశాల్లో ఉన్న భారతీయులకు కాపలాదారును
సోషల్ మీడియాను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకునే కేంద్ర మంత్రుల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. విదేశాల్లో ఉన్న వారు తమ సమస్యను చిన్న ట్వీట్ రూపంలో నివేదిస్తే చాలు, ఆమె సత్వరమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే, సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్ లో కనిపించే ట్వీట్లకు సమాధానం ఇచ్చేది ఆమె పీఏ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, సుష్మ ఆసక్తికరమైన జవాబిచ్చింది. "మీరు ఎలాంటి సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు, ఆ ట్వీట్లు చేసేది నేనే.. నేను కాకపోతే నా దెయ్యం వచ్చి ట్వీట్లు చేస్తుందా?" అంటూ బదులిచ్చారు.
ఇప్పుడా ట్వీట్ కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన కనిపిస్తోంది. కొద్దిసమయంలోనే 10 వేల మంది ఆ ట్వీట్ ను లైక్ చేశారు. సుష్మ సమయస్ఫూర్తితో జవాబు చెప్పిన విధానాన్ని చాలామంది అభినందిస్తున్నారు. అంతేకాదు, తన పేరుకు ముందు 'చౌకీదార్' ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా సుష్మ మరో ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. విదేశాల్లో ఉన్న భారత ప్రజలకు కాపలాదారును కాబట్టే 'చౌకీదార్' అని పెట్టుకున్నట్టు తెలిపారు.