Jagan: చంద్రబాబుతోనే కాదు ఈ చానళ్లన్నింటితో కూడా పోరాడాలి!: జగన్
- మీడియాలో ఓ వర్గం అమ్ముడుపోయింది
- కార్యకర్తలు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి
- గిద్దలూరు సభలో జగన్ ప్రసంగం
ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడమే పరమావధిగా పెట్టుకున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా గిద్దలూరు రోడ్ షోలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చేయని కుట్రంటూ ఉండదని, అన్ని రకాలుగా మోసాలకు తెరలేపుతారని ఆరోపించారు. అయితే, తమ పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదని, మీడియాలో ఓ వర్గంతో కూడా పోరాడాల్సి వస్తోందని అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9 మీడియా సంస్థలన్నింటితో తాము పోరాడక తప్పని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. కుట్రలతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తుంటే, కొన్ని పత్రికలు, చానళ్లు అమ్ముడుపోయాయని జగన్ ఆరోపించారు. అయితే కార్యకర్తలు ఈ కుట్రలను దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామానికి వెళ్లి నవరత్నాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.