Chandrababu: మీకు పులివెందుల అడ్డపంచెలవాళ్లు కావాలా?: శ్రీకాకుళం రోడ్ షోలో చంద్రబాబు
- జగన్ కు ఓటేస్తే పులివెందుల అరాచకాలే!
- ఆడబిడ్డలు రోడ్లపై తిరగలేరు
- శ్రీకాకుళం రోడ్ షోలో చంద్రబాబు విమర్శలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చివరగా శ్రీకాకుళం పట్టణంలోని సెవెన్ జంక్షన్ రోడ్ లో ఏర్పాటుచేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్ అసెంబ్లీకి వచ్చింది 24 రోజులైతే కోర్టుకు మాత్రం 240 సార్లు వెళ్లాడని ఎద్దేవా చేశారు. జగన్ కు ఓటేస్తే పులివెందుల అరాచకాలు రాష్ట్రమంతటా జరుగుతాయని హెచ్చరించారు. ఊరికో కీచకుడు తయారవుతాడని, ఫులివెందుల అడ్డపంచెలవాళ్లు దిగుతారని, ఆడబిడ్డలు రోడ్లపై తిరగలేరని ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పట్లో వైఎస్ విజయమ్మ విశాఖలో పోటీకి దిగగానే పులివెందుల నుంచి అడ్డపంచెల వాళ్లందరూ దిగారని, వైజాగ్ లో విలువైన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నారని ఆరోపించారు. ప్రజలు వాళ్ల వ్యవహారం ముందే గమనించి విజయమ్మను ఓడించి లోటస్ పాండ్ కు పంపించారని విమర్శించారు. దేశంలో ఉన్న చట్టాల్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్నీ జగన్ పై ఉన్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే వ్యక్తి ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుకుంటున్నారా? అంటూ ప్రజలను ప్రశ్నించారు.