Chandrababu: ఒకప్పుడు 'ఎంబీఏ' అని పెట్టుకునేవాడు, ఇప్పుడేంటో 'బీకాం'కు తగ్గాడు: జగన్ పై చంద్రబాబు విసుర్లు
- జగన్ రోజుకో క్వాలిఫికేషన్ పెట్టుకుంటున్నాడు
- ఈయనేంటో ఎంబీఏ తర్వాత బీకాంకు వచ్చాడు
- ఇచ్ఛాపురం సభలో టీడీపీ అధినేత సెటైర్లు
ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రతిపక్ష నేత జగన్ పై సెటైర్లు గుప్పించారు. కోడికత్తి పార్టీ అధినేత రోజుకో క్వాలిఫికేషన్ పెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. మొదట్లో ఎంబీఏ అని పెట్టుకునేవాడని, ఇప్పుడెందుకో బీకాం అని పెట్టుకుంటున్నాడని విమర్శించారు.
ఎవరైనా బీకాం తర్వాత ఎంబీఏ చేస్తారని, ఈయనేంటో ఎంబీఏ నుంచి బీకాంకు తగ్గాడని ఎత్తిపొడిచారు. ఆయన చేసేవన్నీ తప్పుడు పనులేననీ, ఏమీ తెలియని జీరో అని వ్యాఖ్యానించారు. అతడ్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే తప్ప ఏదీ సాధ్యం కాదని అన్నారు. పెద్దగా కష్టం తెలియని వ్యక్తి అని, ఉదయం నుంచి జల్సాగా రెండు మూడు మీటింగ్ లు పెట్టుకుని సాయంత్రానికి పని ముగిస్తాడని ఎద్దేవా చేశారు.
పాదయాత్ర చేసినప్పుడు కూడా సాయంత్రం ఆరింటికల్లా అంతా అయిపోయేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. శుక్రవారం వస్తే హైదరాబాద్ కోర్టుకు వెళతాడని, అతను ఎలాంటి వ్యక్తి అంటే, అసెంబ్లీకి 24 సార్లు వస్తే కోర్టుకు మాత్రం 240 సార్లు వెళ్లాడని గణాంకాలతో సహా వివరించారు.
ఈయనకు చాలా భయం అని, నరేంద్ర మోదీని చూస్తే వెన్నులో వణుకు పుడుతుందని, కేసీఆర్ ను చూస్తే ఉచ్చలు పోసుకుంటాడని ఎద్దేవా చేశారు. అంతా చిన్నపిల్లాడి తరహా అని తీసిపారేశారు. తప్పులు చేశాడు కాబట్టే వాళ్లకు భయపడుతున్నాడని అన్నారు. ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొనే నైతిక శక్తి తనకుందని చంద్రబాబు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.