YSRCP: చక్కెర పరిశ్రమలు మూతపడుతుంటే చంద్రబాబు కోడలు ఐస్ క్రీమ్ కంపెనీలు ప్రారంభిస్తోంది: రోజా
- రాష్ట్రం అప్పుల్లో ఉన్నా బాబు కుటుంబం బాగుపడింది
- భార్య ఆస్తులు పెరిగాయి
- ప్రచార సభలో రోజా విమర్శలు
వైసీపీ మహిళానేత, నగరి ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబు కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, కరవు రావాలంటే చంద్రబాబు రావాలని, పొలాల్లో ఎరువు రావాలంటే జగన్ రావాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పటివరకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారని, అయినా సొంత జిల్లా చిత్తూరుకు ఆయన చేసిందేమీ లేదని పెదవి విరిచారు.
ఓవైపు చిత్తూరు జిల్లాలో చక్కెర పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుని మూతపడుతుంటే, మరోవైపు చంద్రబాబు కోడలు మాత్రం ఐస్ క్రీమ్ కంపెనీలు ప్రారంభిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం అప్పులపాలైనా గానీ చంద్రబాబు భార్య ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని అన్నారు. అంతేకాకుండా, 2014లో జాతీయ నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చారని, ఈసారి విడివిడిగా వస్తున్నా లోపాయకారీగా పొత్తు ఉందని రోజా ఆరోపించారు.