Jagan: ఆ ఇంగ్లీషు దినపత్రిక ఎలా రాసిందో చంద్రబాబు అలాగే ఓడిపోతారు: డీఎల్ జోస్యం
- అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఓడించారు
- ఇప్పుడు జగన్ ఓడిస్తారు
- వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి
మాజీ మంత్రి, కడప జిల్లా నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లా మైదుకూరులో జగన్ ఎన్నికల ప్రచారంలో డీఎల్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత జగన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎల్ మాట్లాడుతూ, 2004లో వైఎస్సార్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో, 2019లో కూడా జగన్ చేతిలో అలాగే ఓడిపోతారని ఓ ఇంగ్లీషు దినపత్రిక రాసిందని, ఇప్పుడది నిజం కాబోతుందని అన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును ఎంతో విలువైనదిగా భావించి చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి వినియోగించుకోవాలని డీఎల్ పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ముఖ్యంగా గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దివంగత వైఎస్సార్ తనకు మంచి స్నేహితుడని, ఇప్పుడాయన కుమారుడి పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని డీఎల్ చెప్పారు. వెఎస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారంటూ ఆయన జోస్యం చెప్పారు.