Telugudesam: నా మాటే వినరా?.. తొమ్మిది మంది రెబల్స్ పై చంద్రబాబు బహిష్కరణ వేటు
- తిరుగుబాటు అభ్యర్థులపై ఆగ్రహం
- సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన
- రెబల్స్ లో ఇద్దరు మహిళలు
ఎన్నికల వేళ ఏ పార్టీకైనా రెబల్స్ బెడద ఉండేదే! అందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కొందరితో తిప్పలు తప్పవు. ఈ రెబల్స్ ఒక్కోసారి సంచలనాలు నమోదు చేసిన రికార్డులున్నాయి. అంతేకాదు, పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓట్లకు రెబల్స్ గండికొడుతుంటారు. అందుకే అన్ని పార్టీలు రెబల్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. ఇక మాట వినని పక్షంలో బహిష్కరణ వేటు వేస్తుంటారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా టీడీపీ రెబల్స్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరీ బరిలో దిగడం క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని, అందుకే ఈసారి రెబల్స్ గా బరిలో ఉన్న 9 మందిపై బహిష్కరణ వేటు వేస్తున్నట్టు టీడీపీ హైకమాండ్ వెల్లడించింది. కడప నుంచి రాజగోపాల్, తాడికొండ నుంచి సర్వా శ్రీనివాసరావు, తంబాళ్లపల్లి నుంచి మాధవరెడ్డి, విశ్వనాథరెడ్డి, మదనపల్లె నుంచి బొమ్మనచెరువు శ్రీరాములు, బద్వేలు నుంచి విజయజ్యోతి, గజపతినగరం నుంచి కె.శ్రీనివాసరావు, రంపచోడవరం నుంచి ఫణీశ్వరి, అవనిగడ్డ నుంచి కంఠమనేని రవిశంకర్ రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీరందరిపైనా బహిష్కరణ వేటు పడింది.